October 10, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

విశాఖ మేయర్ రేసులో సీఎం రమేష్ భార్య.. బీసీల్లో తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన విశాఖపట్నం (GVMC) మేయర్ పీఠం చుట్టూ ప్రస్తుతం రాజకీయం వేడెక్కుతోంది. కేంద్రంలో ఉన్న పలుకుబడి, అధికార కూటమి పెద్దలతో ఉన్న అనుబంధంతో విశాఖ మేయర్ సీటును దక్కించుకునేందుకు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తెరవెనుక తీవ్రంగా పావులు కదుపుతున్నారనే వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.

విశాఖ రాజకీయాల్లో తన పట్టు సాధించేందుకు ఎంపీ సీఎం రమేష్ తన భార్య శ్రీదేవిని రాబోయే ఎన్నికల్లో మేయర్ బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బీసీ కేటగిరీ పరిధిలో చర్చలో ఉన్న ఈ స్థానాన్ని, రాజకీయ ఒత్తిళ్లతో ఓసీ (మహిళ) లేదా ఓపెన్ కేటగిరీ కిందకు రిజర్వు చేయించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమచారం.

రిజర్వేషన్ వ్యూహాలు – తిరుగుబాటు బాటలో స్థానిక బీసీలు
సీఎం రమేష్ వెలమ సామాజికవర్గానికి చెందినవారైనప్పటికీ, ఆయన భార్య శ్రీదేవి ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఈ సమీకరణాలను వాడుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నారని ప్రచారం సాగుతుండటంతో, స్థానిక బీసీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే విశాఖ ఎంపీ స్థానాన్ని స్థానికేతరులకే కేటాయించారని, ఇప్పుడు మేయర్ పీఠాన్ని కూడా స్థానికేతరులకు అప్పగిస్తే విశాఖ స్థానిక నాయకత్వానికి, ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సహజ వనరుల తవ్వకాలు – పగడ్బందీగా ప్రజల నిరసన
గతంలో పంచదార్ల కొండను తవ్వేసి కోట్ల రూపాయల విలువైన గ్రావెల్‌ను తరలించారని, తాజాగా పరవాడ మండలం మర్రిపాలెంలో అర్ధరాత్రి వేళ కొండలను నిలువునా తవ్వేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికార అండతో జరుగుతున్న ఈ దోపిడీకి తోడు, ఇప్పుడు విశాఖ నగర పాలక వ్యవస్థనే చేజిక్కించుకునేందుకు ప్రయత్నించడంపై ప్రజలు మండిపడుతున్నారు.

హెచ్చరిస్తున్న స్థానికులు
కూటమి ప్రభుత్వం పొరపాటున రిజర్వేషన్లు మార్చి శ్రీదేవికి టికెట్ కేటాయిస్తే, పార్టీలకు అతీతంగా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తామని స్థానిక ప్రజలు, బీసీ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. స్థానికేతరులను బరిలోకి దింపితే రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.

నాని ‘ది ప్యారడైజ్’ – హైప్ వర్సెస్ రియాలిటీ..!

'దసరా' వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత, నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అనౌన్స్ కాగానే టాలీవుడ్ లో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం – 'ది ప్యారడైజ్'.

కయాదు లోహర్ కథానాయికగా, అనిరుధ్ రవిచందర్ సంగీతంలో తెరకెక్కిన ఈ చిత్రంపై విడుదలకి ముందే అపారమైన క్రేజ్ నెలకొంది. పాటలు, టీజర్, గ్లింప్స్ ఇచ్చేసిన కిక్ తో సినిమా మేకర్స్ ఏకంగా ట్రైలర్ కూడా విడుదల చేయకుండానే సెప్టెంబర్ 24న థియేటర్లలోకి తెచ్చారు. ప్రీమియర్ షోల నుంచే సోషల్ మీడియాలో దీనిపై రకరకాల చర్చలు మొదలయ్యాయి.

అసలు విడుదల ముందు వరకు ఎలాంటి టాక్ నడిచింది? థియేటర్లలోకి వచ్చాక ఈ 'జడల్' ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించాడు? 'అతి సర్వత్ర వర్జయేత్' అనే నానుడి ఈ సినిమాకు ఎలా వర్తిస్తుందో ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం!

ముందుగా ఈ 'ది ప్యారడైజ్' కథాంశాన్ని పరిశీలిస్తే… ఇది దేశానికి స్వాతంత్ర్యం వచ్చి మూడున్నర దశాబ్దాలు గడిచినా, ప్రభుత్వ లెక్కల్లోనూ, సమాజంలోనూ ఎలాంటి గుర్తింపునకు నోచుకోని 'సవారీలు' అనే ఐదు వేల మంది మానవ సమూహం అస్తిత్వ పోరాట గాథ.

హైదరాబాద్‌లోని దొరలు ఈ సవారీలను దొంగసారా కాయించడానికి, నేరాలు చేయించడానికి వాడుకుంటారు తప్ప మనుషులుగా గుర్తించరు. వైద్యం, విద్య వంటి ప్రాథమిక హక్కులు కూడా వారికి శూన్యం. ఇలాంటి అమాయక జనాన్ని అణచివేస్తూ, దారుణంగా హింసించే క్రూరమైన విలన్ శికంజా మాలిక్ (మోహన్ బాబు), అతని కొడుకు చోటా మాలిక్ (రాఘవ్ జుయల్).

ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి సమ్మక్క (సోనాలీ కులకర్ణి) నడుం కడుతుంది. అయితే మాలిక్ దాష్టికానికి ఆమె కవల పిల్లలలో ఒక ఆడపిల్ల కన్నుమూయడంతో… మిగిలిన కొడుకునే కూతురిలా జడలు వేసి పెంచుతుంది. అతనే మన కథానాయకుడు జడల్ (నాని).

ప్రారంభంలో తల్లిపై ద్వేషం పెంచుకుని, జైలు శిక్ష అనుభవించి వచ్చిన జడల్… ఆ తర్వాత తన మిత్రుడు బిర్యానీ (సంపూర్ణేష్ బాబు), తల్లి సమ్మక్కల జీవితాల్లో జరిగిన తీవ్ర పరిణామాల వల్ల మారతాడు. సవారీ జాతికి నాయకుడిగా నిలబడి, శికంజా మాలిక్ సామ్రాజ్యంపై ఎలా తిరుగుబాటు చేశాడు? వారి ఆత్మగౌరవాన్ని ఎలా నిలబెట్టాడు? అనేదే ఈ చిత్ర ముఖ్యాంశం.

విడుదలకు ముందు ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు ప్రచారంలోకి వచ్చాయి. సినిమాలో ప్రధానంగా నాలుగు విస్ఫోటనాత్మకమైన యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయని, ఇంటర్వెల్ బ్యాంగ్ ఊహించని రేంజ్ లో ఉంటుందని టాక్ నడిచింది. అనిరుధ్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అమ్మ సెంటిమెంట్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని భావించారు. దాదాపు 2 గంటల 54 నిమిషాల సుదీర్ఘ నిడివితో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

అయితే, ఈ సినిమాలో హింస, క్రౌర్యం మోతాదు దాటిపోయాయి. సలసలకాగే నూనెలో మనుషులను పడేసి కాల్చడం, మహిళలతో బలవంతంగా దుస్తులు విప్పించడం, గర్భిణీ స్త్రీకి విద్యుత్ షాక్ ఇవ్వడం, స్త్రీలను వేలంలో అమ్మడం వంటి అత్యంత దిగ్భ్రాంతికర దృశ్యాలు ఇందులో ఉన్నాయి.

తల్లి సెంటిమెంట్ కథలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ, ఈ రకమైన తీవ్రమైన వైలెన్స్ కారణంగా ఇది చిన్న పిల్లలతో, కుటుంబ సమేతంగా చూసే సినిమా ఎంతమాత్రం కాదనేది స్పష్టమైంది.

ఇక సినిమా థియేటర్లలోకి వచ్చాక అసలు ఫలితం ఎలా ఉందనే విషయానికి వస్తే… "అతి సర్వత్ర వర్జయేత్" అన్న నానుడి ఈ చిత్రానికి కచ్చితంగా సరిపోతుంది.

అస్తిత్వ పోరాట గాథలకు 'భావోద్వేగం' ప్రాణవాయువు. కానీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆ ఎమోషన్‌ను పక్కనపెట్టి, తీవ్రమైన రక్తపాతానికే ప్రాధాన్యత ఇచ్చారు. గుర్తింపు లేని ఐదు వేల మంది సవారీల పోరాటం కాస్తా… ఆయుధాలు పట్టి "ప్రత్యేక దేశం" ఏర్పాటు చేసుకునే స్థాయికి మార్చడం హాస్యాస్పదంగానూ, తీవ్ర అతిగానూ మారింది.

పోరాటానికి సరైన ముగింపు లేకుండా, క్లైమాక్స్‌లో ఉన్నపళంగా ఒక ముఖ్యమంత్రి పాత్రను తెచ్చి రాజకీయ రంగు పులమడం నాటకీయతను తగ్గించేసింది. తెలంగాణ రాజకీయ వర్గాల నడుమ వైరం సృష్టించే యత్నంలా ఇది కనిపించినా, సగటు ప్రేక్షకుడికి మాత్రం కావాల్సిన వినోదం లభించక నిరాశే మిగిలింది. తల్లి, కూతురు బి-గ్రేడ్ సినిమాలు తీసి అప్పులు తీర్చడం వంటి ఉపకథలు దర్శకుని రచనా లోపాలను ఎత్తిచూపుతున్నాయి.

నటీనటుల ప్రదర్శన విషయానికి వస్తే…

మాస్ హీరో ఇమేజ్ కోసం తపిస్తున్న నేచురల్ స్టార్ నాని, 'జడల్' పాత్ర కోసం పడిన శ్రమ, రెండు జడల కొత్త లుక్ ప్రశంసనీయం. కానీ, కథలో సరైన ఎమోషన్ లేకపోవడంతో ఆ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది.

కథానాయకి కయాదు లోహర్ పాత్ర డిజైన్ అత్యంత పేలవంగా ఉంది. అయితే, తల్లి సమ్మక్కగా చేసిన సోనాలీ కులకర్ణి, ఆమె స్నేహితురాలిగా ఈశ్వరీరావు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. చాలా కాలం తర్వాత మోహన్ బాబు క్రూరమైన విలన్‌గా మెప్పించగా, ఆయన కొడుకుగా నటించిన రాఘవ్ జుయల్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి తమ వంతు పాత్రలు పోషించారు.

సాంకేతిక విభాగంలో సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఉన్నతంగా ఉన్నాయి. అనిరుధ్ రవిచందర్ తన నేపథ్య సంగీతంతో (BGM) సినిమాను గట్టెక్కించడానికి మాగ్జిమమ్ ప్రయత్నం చేశాడు. కానీ పాటలు విడిగా విన్నప్పుడు ఇచ్చిన కిక్, సినిమాలో సన్నివేశాలతో కలిసి చూసినప్పుడు ఇవ్వలేకపోయాయి.

మొత్తానికి, 'ది ప్యారడైజ్' రూపంలో నాని, నిర్మాత సుధాకర్ చెరుకూరి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను నమ్మి భారీ బడ్జెట్, శ్రమ కేటాయించారు. అయితే, మేకర్స్ పడిన శ్రమ కంటే… థియేటర్లలో తీవ్రమైన వైలెన్స్, అర్థం లేని కథనంతో ప్రేక్షకులు పడిన కష్టమే ఎక్కువగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సవారీలు అనే నూతన కోణాన్ని తాకినా, ఆచరణాత్మకత లేని కథనం, మితిమీరిన రక్తపాతం ఈ సినిమాను ప్రేక్షకులకు దూరం చేశాయి. 'ది ప్యారడైజ్' అనే భారీ టైటిల్ కంటే 'సమ్మక్క' అని పెట్టి ఉంటే అంచనాలు తగ్గి, ప్రేక్షకులు కొంతైనా తృప్తి పడేవారేమో! రాబోయే రోజుల్లో ఇందులోని పొలిటికల్ అంశాలు, సెన్సార్ వివాదాలపై సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ జరుగుతుందో వేచి చూడాలి.

సినిమా విశేషాలపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

దక్షిణాదిలో క్రైస్తవం వర్సెస్ హిందూ.?

దక్షిణ భారతదేశ రాజకీయాలు రాబోయే రోజుల్లో సరికొత్త వ్యూహాత్మక, సిద్ధాంత పోరాటానికి వేదిక కాబోతున్నాయనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో తీవ్రంగా నడుస్తోంది. తాజాగా ‘ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్ డైరెక్టర్ ఏబీకే (ఆర్కే) తన ‘కొత్తపలుకు’ విశ్లేషణలో దక్షిణాది రాష్ట్రాల్లో రాబోయే కాలంలో "క్రైస్తవం వర్సెస్ హిందూ" రాజకీయాలు బలంగా ముదిరే అవకాశం ఉందంటూ వేసిన అంచనా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ప్రాంతీయ రాజకీయాలు, సంక్షేమ పథకాల చుట్టూ తిరిగే దక్షిణాది రాజకీయం క్రమంగా మతపరమైన ధ్రువీకరణ వైపు మళ్లుతోందనడానికి ఇది స్పష్టమైన సంకేతమని పలువురు భావిస్తున్నారు.

ఈ మొత్తం పరిణామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారనేది ఆర్కే విశ్లేషణలోని ప్రధానాంశం. తన రాజకీయ లబ్ధి మరియు పటిష్టమైన ఓటు బ్యాంకు నిర్మాణంలో భాగంగా జగన్ రెడ్డి వ్యవస్థాగతంగా మత మార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇందుకోసం తన వ్యక్తిగత లేదా కుటుంబ సంపాదన నుంచి ‘దశమభాగం’ అంట ఆదాయంలో పదవ వంతు చర్చిలు, క్రైస్తవ సంస్థలకు కేటాయిస్తున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉన్నాయి. ఈ నిధులతో చర్చిల కేంద్రంగా విస్తృత స్థాయిలో మత మార్పిడులు జరుగుతున్నాయని, గిరిజన, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాలు సాగుతున్నాయని పరిశీలకులు ఆరోపిస్తున్నారు.

ఉదాహరణకు, అరకు వంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులను పెద్ద సంఖ్యలో క్రైస్తవ మతం వైపు మళ్లించి, వారిని ఒక పటిష్టమైన ఓటు బ్యాంకుగా మార్చడంలో వైసీపీ సఫలమైందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇదే అరకు మోడల్‌ను ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరింపజేయడమే కాకుండా, తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రవేశపెట్టి అక్కడ కూడా పార్టీని లేదా తన సిద్ధాంతాన్ని బలోపేతం చేయాలనేది జగన్ రెడ్డి ఆలోచనగా కనిపిస్తోంది. సారాంశంలో, ప్రస్తుతం జగన్ పొందుతున్న ప్రధాన రాజకీయ బలమంతా క్రైస్తవ సామాజిక వర్గ మద్దతుతో కూడుకున్నదేననేది ఈ కథనం ద్వారా స్పష్టమవుతోంది. అంతేకాకుండా, పార్టీలో ఉన్నతాధికార పదవులు లేదా రాజకీయ ప్రాధాన్యత లభించాలంటే మత మార్పిడి సంస్కృతికి ఆమోదం తెలపాలనే వాతావరణాన్ని వైసీపీలో తెచ్చారనే విమర్శలు కూడా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో జగన్ రెడ్డి అనుసరిస్తున్న ఈ మత ఆధారిత ఓటు బ్యాంకు వ్యూహమే తమిళనాడులోనూ పురుడు పోసుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. అక్కడ ఇప్పుడే రాజకీయ అరంగేట్రం చేసిన ప్రముఖ నటుడు విజయ్ (తమిళగ వెట్రి కళగం) వెనుక కూడా ఇదే తరహా శక్తి పనిచేస్తోందని ఆర్కే పేర్కొన్నారు.

విజయ్ రాజకీయాల్లోకి రాకముందే మరియు ఆ తర్వాత ఆయన వెనుక ఉన్న ముఖ్య నాయకులు, వ్యూహకర్తలు జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన వ్యక్తులేనని తెలుస్తోంది. తమిళనాడులో విజయ్ అధికారంలోకి వస్తే లేదా ప్రభావం చూపితే, పాలనా పరమైన నిర్ణయాల్లో చర్చిల ప్రమేయం పెరుగుతుందనే ప్రచారం సాగుతోంది. అధికారుల బదిలీలు, కీలక పోస్టింగ్‌లు కూడా చర్చిల ఆమోదంతోనే జరుగుతాయనే స్థాయికి పరిస్థితులు దాపిస్తాయని, జగన్-విజయ్ ల మధ్య ఉన్న ఈ అంతర్గత బంధం దక్షిణాదిలో ఒక కొత్త క్రైస్తవ ధ్రువీకరణ కూటమికి దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

దక్షిణాదిలో శరవేగంగా జరుగుతున్న ఈ మత మార్పిడులు, దానికి అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ఓటు బ్యాంకు రాజకీయాల పట్ల కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనాయకత్వం, ముఖ్యంగా ప్రధాని తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు సమాచారం. ‘మత మార్పిడి మాఫియా’ను అదుపులోకి తీసుకురావాలని, దక్షిణాదిలో హిందూ సమాజం ఎదుర్కొంటున్న ఈ సవాలును తిప్పికొట్టాలని భాజపా పెద్దలు ఒక నిశ్చయానికి వచ్చినట్లు ఆర్కే తన ఆర్టికల్‌లో ప్రస్తావించారు.

అయితే, ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏమిటంటే—జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనా కాలంలో మత మార్పిడులు ఒక ఉద్యమంలా సాగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందనేది. ఘోరమైన ఆరోపణలు, నేర అభియోగాలు ఎదుర్కొంటున్న నాయకులు కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా రాజకీయాలు నెరపేందుకు కేంద్రం వైఖరి కూడా ఒక రకంగా దోహదపడిందనే విమర్శలు ఉన్నాయి. కేంద్రం చట్టపరమైన కట్టడి చేయడం కొన్ని గంటల పని మాత్రమే అయినప్పటికీ, రాజకీయ లెక్కల వల్ల ఇప్పటివరకు ఆలస్యమైందనే అభిప్రాయం ఉంది.

ఏది ఏమైనప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలకు మత మార్పిడులు మరియు దాని ఆధారిత రాజకీయాలు అతిపెద్ద ఆధ్యాత్మిక, సామాజిక సవాలుగా పరిణమించాయనడంలో సందేహం లేదు. సమాజంలో సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకునేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం గనుక ఈ అంశంపై సీరియస్‌గా దృష్టిసారించి చట్టపరమైన, పాలనాపరమైన చర్యలకు పూనుకుంటే, రాబోయే రోజుల్లో దక్షిణాది రాజకీయం “క్రైస్తవం వర్సెస్ హిందూయిజం” ప్రాతిపదికన తీవ్ర ఉద్రిక్తతలకు, సంచలన పరిణామాలకు వేదిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.

కాంగ్రెస్ కు షాక్.. కేసీఆర్ గూటికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు

తెలంగాణ రాజకీయ రంగస్థలంపై మరో ఉత్కంఠభరిత ఘట్టం ఆవిష్కృతమవుతోంది! కాంగ్రెస్ హవాలో బీఆర్ఎస్ నుంచి 'హస్తం' గూటికి చేరిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. స్పీకర్ స్థానంలోనూ, కోర్టుల ప్రాంగణాల్లోనూ అనర్హత వేటు పిటిషన్లు వేడెక్కుతున్న వేళ… సొంత పక్షంలోనే ఎమ్మెల్యేలకు చుక్కెదురవుతోంది. ఆశించిన స్థానం దక్కకపోవడం, పాత కాంగ్రెస్ కేడర్ తిరుగుబాట్లు, నియోజకవర్గాల్లో పట్టు సడలుతుండటంతో ఫిరాయింపు నేతల గుండెల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి.

పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, గూడెం మహిపాల్ రెడ్డి వంటి హేమాహేమీలు కాంగ్రెస్ సర్కార్‌పై బహిరంగంగానే విమర్శల బాణాలు సంధిస్తున్నారు. ఊహాగానాలకు తెరదించుతూ, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కావడం, గులాబీ కండువా కప్పుకొని బీఆర్‌ఎస్ఎల్పీ (BRSLP) సమావేశానికి ప్రత్యక్షమవ్వడం రాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా ఉలెక్కిపడేలా చేసింది!

కోదాడ ప్రమాద మృతులకు పవన్ కళ్యాణ్ సంతాపం

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తంచేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో అర్ధం కాలేదు..

బాలకృష్ణ శోభన్ బాబు మల్టీ స్టారర్ , ఇళయరాజా అల్టిమేట్ సాంగ్స్, మీనా నగ్మా లాంటి టాప్ హీరోయిన్స్,అమ్రిష్ పురి విలన్, రాఘవేంద్ర రావు డైరెక్షన్ ….హై బడ్జెట్ తో, ఆకాశాన్నంటే అంచనాలతో రిలీజ్ అయిన మూవీ. శోభన్ బాబు పాత్రను మధ్యలో చంపేయడం, క్లైమాక్స్ సాగదీత, అక్కడ సాంగ్ పెట్టడం..మూవీ పరాజయానికి కారణాలు. గజిని మూవీలో విలన్ క్యారక్టర్ లో ట్విస్ట్ అశ్వమేధం లో ఎప్పుడో పెట్టారు.

శోభన్ గారి ఫాన్స్ అయన సూసైడ్ చేసుకునే సీన్ తీసేయమని గొడవ చేసారు. కేవలం మాకు మాత్రమే మంచి హిట్ ఇవ్వలేదనే కోపంతో మేజర్ చంద్రకాంత్ షూటింగ్ లో ఉన్న రాఘవేంద్ర రావు మీదకు గొడవకు వెళ్లారు బాలయ్య ఫాన్స్. ఈ సినిమా తర్వాత రాఘవేంద్ర రావు తో కానీ, అశ్వనీదత్ తో కానీ సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యారు బాలయ్య. కానీ రాఘవేంద్ర రావు తో ఎప్పటికో పాండు రంగడు చేసారు. అయితే అశ్వమేధం మూవీ మాత్రం ఎప్పుడు టీవీ లో చూసినా "బాగుందే , ఎందుకు ప్లాప్ అయిందబ్బా " అనిపిస్తుంది

శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం

ఏపీ శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడిచింది. డీఎస్సీపై చర్చకు వైసీపీ నేతలు పట్టుబడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(సోమవారం) ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ప్రశ్నోత్తరాలతో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌ రాజు సభా కార్యకలాపాలు మొదలుపెట్టారు. సభ మొదలైన వెంటనే డీఎస్సీ అక్రమాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. విచారణ జరిపించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో.. పోడియం వద్ద ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు.

‘వెంకీ అనిల్-5’పై ఆసక్తికర అప్‌డేట్

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వెంకీ అనిల్ 5’పై ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సక్సెస్ తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ లెఫ్టినెంట్ కర్నల్ వెంకట్ రెడ్డి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

తాజాగా విడుదలైన ఆయన లుక్‌లో పూర్తిగా కొత్తగా, గంభీరమైన మిలటరీ అధికారిగా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. వెంకటేష్ గతంలో చేసిన ఫ్యామిలీ, కామెడీ, ఎమోషనల్ పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో మిలటరీ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌ను కొనసాగిస్తూనే కథలో యాక్షన్, ఎమోషన్‌ను కూడా మేళవిస్తున్నట్లు సమాచారం. వెంకటేష్‌కు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు కొత్త తరహా యాక్షన్ కంటెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులను కూడా టార్గెట్ చేసేలా సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లెఫ్టినెంట్ కర్నల్ పాత్ర కోసం వెంకటేష్ లుక్‌ను మార్చడం సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. సినిమాలో ఆయన పాత్ర కథను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, మిలటరీ నేపథ్యం ఎంతవరకు కీలకంగా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. అనిల్ రావిపూడి–వెంకటేష్ కాంబినేషన్‌కు ఇప్పటికే మంచి ట్రాక్ రికార్డ్ ఉండటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తంగా లెఫ్టినెంట్ కర్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్ కొత్త అవతారం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారేలా కనిపిస్తోంది.

ఏడేళ్ల సస్పెన్స్ కు తెర: సరికొత్త లుక్ లో రెబల్ స్టార్ ‘ఇన్‌స్టా DP’ వైరల్!

హైదరాబాద్: పాన్-ఇండియా కటౌట్, రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్నా సరే... ఆయన పేరు వినిపిస్తే చాలు రికార్డులు తిరగబడాల్సిందే. స్క్రీన్ పైనే కాదు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్ (Instagram) వేదికగా చేసిన ఒక చిన్న మార్పు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఏకంగా ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ డిస్‌ప్లే పిక్చర్ (DP)ను మార్చడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

2017 తర్వాత మళ్లీ ఇప్పుడే... ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి అంటే దాదాపు ఏడేళ్లుగా ఒకే ఫొటో (బాహుబలి లుక్ లేదా పాత పిక్) మాత్రమే డిపీగా ఉండేది. సాధారణంగా స్టార్ హీరోలు తమ ప్రతి సినిమా విడుదల సమయంలోనో, లేదా ఏదైనా షూట్ ఉన్నప్పుడో తరచూ DPలు మారుస్తూ ఉంటారు. కానీ, ప్రభాస్ శైలి వేరు. ఆర్బాటం లేని జీవితాన్నిష్టపడే ప్రభాస్, సోషల్ మీడియా యాక్టివిటీకి కాస్త దూరంగానే ఉంటారు. అలాంటిది అకస్మాత్తుగా ఆయన తన ప్రోఫైల్ పిక్చర్ మార్చేసరికి అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

కొత్త లుక్... నయా వైబ్! తాజాగా ప్రభాస్ అప్‌డేట్ చేసిన DPలో ఆయన అత్యంత స్టైలిష్ గా, రాయల్ లుక్ లో కనిపిస్తున్నారు. చార్మింగ్ షేడ్స్, పవర్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్‌తో ఉన్న ఈ పిక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. "ఏడేళ్ల నిరీక్షణకు తగిన న్యాయం జరిగింది", "కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్!" అంటూ సోషల్ మీడియా కామెంట్ సెక్షన్లలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఫ్యాన్ పేజీలు, ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ ఫొటో నిమిషాల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

అప్ కమింగ్ సినిమాల మేనియానేనా? అయితే, ప్రభాస్ అకస్మాత్తుగా DP మార్చడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా అనే చర్చ కూడా మొదలైంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. దర్శకుడు మారుతితో చేస్తున్న భారీ ఎంటర్‌టైనర్, అలాగే సందీప్ రెడ్డి వంగాతో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్', ప్రశాంత్ నీల్ తో 'సలార్ 2' కాంబినేషన్లు లైనప్‌లో ఉన్నాయి. ఈ క్రమంలోనే రాబోయే కొత్త సినిమా అప్‌డేట్‌కు సంకేతంగానే ఈ లుక్ మార్చారా? లేక ఇది కేవలం ఒక క్యాజువల్ చేంజ్ మాత్రమేనా? అని సినీ విశ్లేషకులు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు.

సోషల్ మీడియాలో 'ప్రభాస్ హవా' ఏది ఏమైనా, ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా కేవలం ప్రొఫైల్ పిక్చర్ మార్చడం ద్వారానే మిలియన్ల కొద్దీ లైక్స్, వేలాది కామెంట్స్ రాబట్టడం ఒక్క ప్రభాస్‌కే సాధ్యమైంది. డిజిటల్ మీడియాలో ఆయనకున్న తిరుగులేని క్రేజ్‌కు ఈ సంఘటనే ఒక ఉదాహరణ. ప్రస్తుతం 'రాయల్ ప్రభాస్' డిపీ సోషల్ మీడియా వేదికలపై సంచలనం సృష్టిస్తూ, ట్రెండింగ్ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

వైసీపీ రాష్ట్ర దూదేకుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దస్తగిరి

సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కట్టుబడిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడేవారిని గుర్తించడంలో ఎప్పుడూ ముందుంటుంది. వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు, జర్నలిస్ట్, షేక్ దస్తగిరిని పార్టీ రాష్ట్ర నూర్ బాషా/దూదేకుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పిన్న వయసులోనే ఇటువంటి కీలకమైన రాష్ట్రస్థాయి బాధ్యత దక్కడం పట్ల వైసీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఆత్మగౌరవ పోరాటాల దస్తగిరి: పోరాటమే ఊపిరిగా..
షేక్ దస్తగిరి పేరు వినగానే గుర్తుకువచ్చేది ఆయనలోని ప్రజా పోరాట పటిమ. చిన్నతనం నుంచే సామాజిక స్పృహ కలిగి, నూర్ బాషా/దూదేకుల వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన గళమెత్తారు. వెనుకబడిన వర్గాల హక్కుల సాధన కోసం, దూదేకుల సామాజిక వర్గ ఆత్మగౌరవం కోసం ఆయన రాజీలేని పోరాటాలు చేశారు.

అణగారిన వర్గాల సంక్షేమం కోసం దస్తగిరి చేపట్టిన నిరాహార దీక్షలు, నిర్వహించిన పోరాట వేదికలు ఆయనలోని పట్టుదలను, ప్రజా నిబద్ధతను చాటిచెప్పాయి. కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్షలకు దిగిన తీరు ఆయనలోని చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచింది.

జగన్ దృష్టిని ఆకర్షించిన నిబద్ధత
పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి తగిన గుర్తింపు లభిస్తుందనడానికి దస్తగిరి నియామకమే ఒక ఉదాహరణ. దూదేకుల సామాజిక వర్గ సంక్షేమానికి ఆయన పడిన తపన, జరిపిన ఉద్యమాలు వైయస్ఆర్సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి దృష్టిని ఆకర్షించాయి.

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన సందర్భంగా పెదకూరపాడు నియోజకవర్గంతో పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, దూదేకుల సామాజిక వర్గ ప్రతినిధులు దస్తగిరిని కలిసి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

సమర్థవంతమైన నాయకత్వంతో కొత్త శకం
షేక్ దస్తగిరి నాయకత్వంలో వైయస్ఆర్సీపీ నూర్ బాషా/దూదేకుల విభాగం మరింత క్రియాశీలకంగా మారనుందనడంలో సందేహం లేదు. చిన్న వయసులోనే ఈ స్థాయి ప్రాతినిధ్యం పొందిన దస్తగిరి, రాబోయే రోజుల్లో పార్టీ పరంగానూ మరియు సామాజికంగానూ తన ముద్ర వేస్తూ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దస్తగిరి శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ..
"నన్ను నమ్మి ఈ చిన్న వయసులోనే రాష్ట్ర నూర్ బాషా/దూదేకుల విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన మన ప్రియతమ నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని,. నూర్ బాషా, దూదేకుల సామాజిక వర్గాల సంక్షేమం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని మూలమూలలా ఉన్న నూర్ బాషా సోదరులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కిందకు తెచ్చి, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తాను."

TOP